Pushpa: పది ‘కేజీయఫ్’లతో సమానం!
తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ఆరంభం నుంచి విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. దీనికి కారణం ఇటీవల ఐకాన్‌స్టార్‌గా మారిన అల్లు అర్జున్ నటిస్తుండటం కాగా.. దానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండటం మరో కారణం. తాజాగా ఈ చిత్రం గురించి మరో డైరెక్టర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఉప్పెన’తో భారీ సక్సెస్ సొంతం చేసుకున్న బుచ్చిబాబు తన గురువు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ను చూశారట. ఈ సినిమాపై బుచ్చిబాబు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
పుష్ప మొదటి భాగం పది ‘కేజీయఫ్’లతో సమానమని బుచ్చిబాబు ఒక్కమాటలో సినిమాకు రివ్యూ ఇచ్చేశారు. హీరో కేరక్టరైజేషన్‌తో పాటు ఎలివేషన్ సన్నివేశాలు పతాక స్థాయిలో చూపించారని ఆయన అన్నారు. హీరో ఎలివేషన్స్‌కు ‘కేజీయఫ్’ పెట్టింది పేరు. యశ్ హీరోగా ప్రశాంత్‌నీల్ దీన్ని తెరకెక్కించారు. దేశవ్యాప్తంగా ఆ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. అదే ఉత్సాహంతో రెండో భాగం కూడా విడుదలకు సిద్ధమైంది. కాగా.. ‘పుష్ప’ చిత్రానికి బుచ్చిబాబు ఇచ్చిన రివ్యూతో ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
శేషాచలం అడవుల్లో సాగే కథతో.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ తెరకెక్కుతోంది. చిత్రకరణలో ఇప్పటికే సింహభాగం పూర్తయింది. మిగిలిన భాగాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తోంది. కాగా.. రెండు భాగాలుగా సినిమాను తీయనున్నారు. బన్ని సరసన రష్మిక సందడి చేయనుంది. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తుండటం సినిమాకు మరో బలంగా భావిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆగస్టు 13న ‘పుష్ప’ను రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించింది. అయితే కరోనా పరిస్థితుల రీత్యా సినిమా విడుదలపై ఎలాంటి స్పష్టత రాలేదు. తొలుత ఒకే పార్ట్ తీయాలని భావించినప్పటికీ.. కథ బాగా పెద్దది కావడంతో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. ‘పుష్ప’ మొదటి భాగం ఈ ఏడాది.. రెండో భాగం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment